: టీడీపీ పాలన ప్రజా వ్యతిరేకంగా సాగుతోంది... అందుకే వైసీపీలో చేరా: బొత్స


ఏపీలో టీడీపీ పాలన ప్రజా వ్యతిరేకంగా సాగుతోందని, ప్రజల తరఫున ప్రభుత్వంపై పోరు సాగించేందుకే వైసీపీలో చేరానని ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గా వ్యవహరించిన బొత్స సత్యనారాయణ చెప్పారు. నేటి ఉదయం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరిన బొత్స, కొద్దిసేపటి క్రితం ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గడచిన ఏడాది పాటు కాంగ్రెస్ లో ఉండే ప్రభుత్వంపై పోరు సాగించానని, అయితే కాంగ్రెస్ పోరాటాల వల్ల ప్రజలకు మేలు జరగలేదని ఆయన అన్నారు. అందుకోసమే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చేరానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకేమీ అన్యాయం చేయలేదని, తనను గౌరవించిందని బొత్స వ్యాఖ్యానించారు. ఒక బాధ్యత కలిగిన రాజకీయ నేతగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తరువాతే, వైసీపీలో చేరానని ఆయన ప్రకటించారు. తనకు ఉన్న అనుభవాన్ని వైసీపీ పురోభివృద్ధికి వినియోగిస్తానన్నారు. వైఎస్ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలన్నీ సమష్టిగా తీసుకున్నవేనని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమను టీడీపీ సర్కారు చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. సింగపూర్ లో చంద్రబాబుకు వ్యాపార భాగస్వాములున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు తనపై చేసే విమర్శలకు తాను స్పందించదలచుకోలేదని కూడా సత్తిబాబు చెప్పారు. తెలంగాణలో ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వైసీపీ మద్దతిచ్చిందన్నారు. స్వార్థం కోసం, స్వలాభం కోసం వైసీపీలో చేరలేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News