: రేవంత్ రెడ్డిని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు...కోర్టుకు చెబుతామన్న న్యాయవాది
ఓటుకు నోటు కేసులో అరెస్టైన టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి పట్ల పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారట. కేసులో మరింత సమాచారం సేకరించాలని కోర్టుకు చెప్పిన ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. నిన్నటి నుంచే మొదలైన విచారణలో భాగంగా నిన్న రాత్రి రేవంత్ రెడ్డిని చాలా సేపు కుర్చీలోనే కూర్చోబెట్టారట. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణలో భాగంగా కనీసం నీళ్లు తాగేందుకు కూడా రేవంత్ రెడ్డికి పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. దుస్తులు మార్చుకోనివ్వడం లేదని, గంటల తరబడి కుర్చీలో కూర్చోబెడుతున్నారని తెలిపారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న రేవంత్ రెడ్డిని పోలీసులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. రేవంత్ పట్ల పోలీసుల దురుసు వైఖరిపై కోర్టుకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.