: చంద్రబాబునూ ప్రశ్నిస్తారట!...రేపు కీలక సమాచారం వెల్లడించనున్న టీ సర్కారు?


ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును కూడా ప్రశ్నించేందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యూహాలకు పదును పెడుతోందట. ఈ క్రమంలో రేపు మరింత కీలక సమాచారాన్ని వెల్లడించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డిని జ్యూడిషియల్ కస్టడీ నుంచి తమ అదుపులోకి తీసుకున్న తెలంగాణ ఏసీబీ నిన్నటి నుంచి పలు కోణాల్లో విచారణ చేస్తోంది. నిన్న పొడిపొడి ప్రశ్నలేసిన ఏసీబీ అధికారులు నేడు మరింత లోతుగా ప్రశ్నించేందుకు సమాయత్తమవుతున్నారు. రేపటితో ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ‘ఏడాది సంతోషం’ లేకుండా చేసేందుకు టీ సర్కారు వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే రేపు కేసుకు సంబంధించి కీలక సమాచారాన్ని బయటపెట్టాలని కూడా ఏసీబీ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News