: లిఫ్టుల్లోనూ మరుగుదొడ్లు... జపాన్ లో సరికొత్త ఏర్పాటు
కేవలం కొన్ని సెకన్లు, మహా అయితే ఒకటి, రెండు నిమిషాల పాటు వినియోగించే లిఫ్టుల్లో మరుగుదొడ్లు ఏమిటనేగా మీ డౌటు? మనకైతే అవసరం లేదుకాని, జపనీయులకు మాత్రం అవసరమేనట. ఎందుకంటే, ఎప్పుడు భూకంపాలు వస్తాయో తెలియదక్కడ. నిత్యం భూకంపాల ముప్పు పొంచి ఉండే జపాన్ లో, ఇళ్లు కూడా అందుకనుగుణంగానే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. భూకంపాల సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం సర్వసాధారణం. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు గంటల నుంచి రోజుల తరబడి సమయం పట్టొచ్చు. సరిగ్గా భూకంపం సంభవించే సమయంలో లిఫ్టులో ఉంటే, అందులో ఇరుక్కుపోవడం జరుగుతుంది కదా. మరి గంటల తరబడి అందులో ఉండాలంటే, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఇబ్బందిని అర్థం చేసుకున్న జపాన్ ప్రభుత్వం లిఫ్టుల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేసింది. ఇప్పుడిప్పుడే అక్కడ ఏర్పాటవుతున్న లిఫ్ట్ టాయిలెట్లు త్వరలోనే అన్ని భవన సముదాయాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి.