: ‘ఫ్యాన్’ కిందకు బొత్స సత్తిబాబు... మరికాసేపట్లో కుటుంబ సమేతంగా వైసీపీలోకి!


ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గానే కాక మంత్రిగానూ కీలక బాధ్యతలు నిర్వర్తించిన బొత్స సత్యనారాయణ నేడు వైసీపీలో చేరనున్నారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన ఆయన, అప్పట్లో తన భార్య బొత్స ఝాన్సీని ఎంపీగా కూడా గెలిపించుకున్నారు. ఈ క్రమంలో తన సొంత జిల్లా విజయనగరంలో తిరుగులేని నేతగా ఎదిగారు. అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడంతో, ఇక అక్కడ మనుగడ లేదనుకున్న బొత్స పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీలో చేరుతున్నట్లు ఇటీవలే ప్రకటించిన సత్తిబాబు, నేడు కుటుంబంతో పాటు తన అనుచరవర్గంతో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. బొత్స వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గం మొత్తం వైసీపీలో చేరబోతోంది. దీంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోయినట్టే. ఇక వైసీపీలో చేరగానే, బొత్స ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఖాయంగానే కనిపిస్తోంది. త్వరలో జరగనున్న ‘స్థానిక’ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బొత్సకు టికెట్ ఇచ్చేందుకు ఇప్పటికే జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News