: పవన్ కల్యాణ్ వర్సెస్ సోము వీర్రాజు...జనసేన ‘హోదా’ నిరసనపై బీజేపీ ఎమ్మెల్సీ ఫైర్!
టాలీవుడ్ ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గడచిన ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీకి ఏపీలో బీజేపీకి కీలక నేతగా ఉన్న సోము వీర్రాజు కార్యాచరణ రూపొందించారు. సోము వీర్రాజు సూచనతోనే పవన్ కల్యాణ్ కు నరేంద్ర మోదీ క్షణాల్లో అపాయింట్ మెంట్ ఇచ్చారు. తాజాగా సోము వీర్రాజు, పవన్ కల్యాణ్ ల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. ఈ వివాదంలో పవన్ ఇంకా ప్రత్యక్షంగా రంగంలోకి దిగకున్నా... సోము వీర్రాజు మాత్రం పవన్, జనసేన కార్యకర్తల మీద బహిరంగంగానే విరుచుకుపడ్డారు. అసలు విషయానికొస్తే... ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ నిన్న విజయవాడలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తక్షణమే ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక, తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకే ఆందోళన చేపట్టినట్లు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ పురోభివృద్ధికి బీజేపీ చేతనయినంత మేర సాయం చేస్తుందని, దీనిపై రాద్ధాంతం తగదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకయ్యనాయుడి రాజీనామా కోరే హక్కు ఏ ఒక్కరికి లేదని కూడా ఆయన తేల్చిచెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆసక్తి ఉంటే పవన్ కల్యాణ్ నేరుగా ప్రధాని నరేంద్ర మోదీని కలవొచ్చని, వాస్తవాలు మోదీనే వెల్లడిస్తారని సూచించారు. మరి, వీర్రాజు వ్యాఖ్యలపై పవన్ స్పందిస్తారో, లేక తన పార్టీ కార్యకర్తలను నిలువరిస్తారో చూడాలి.