: రామ మందిరం నిర్మించకపోతే మోదీ ప్రభుత్వానికి కూడా అదే గతి: వీహెచ్ పీ
అయోధ్యలో రామమందిరం నిర్మించని పక్షంలో నరేంద్రమోదీ సర్కారుకు కూడా గతంలో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని వీహెచ్ పీ హెచ్చరించింది. గత ఎన్నికల్లో ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించింది, కేవలం అభివృద్ధిని చూసి మాత్రమే కాదని, ప్రజల ప్రధాన ఆకాంక్షలను నెరవేరుస్తారని భావించారని విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి, జాతీయ కార్యదర్శి సురేంద్ర జైన్ తెలిపారు. రామ మందిర నిర్మాణంపై బీజేపీ సీనియర్ నేతలు ఎన్ని వ్యాఖ్యలు చేస్తున్నా, రామమందిర నిర్మాణం జరిగి తీరుతుందని తాము ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా, ఇలాంటి ఆకాంక్షలు నెరవేరాలంటే లోక్ సభలో బీజేపీకి 370 సీట్లు ఉండాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పేర్కొనగా, తమ దృష్టి అభివృద్ధిపై తప్ప, ఇతర అంశాలపై కాదని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.