: ఆర్తీ అగర్వాల్ ని పిలిచి ఆడియో వేడుక ఘనంగా నిర్వహిద్దామనుకున్నాం: 'ఆమె ఎవరు' సినిమా యూనిట్
ప్రముఖ సినీ నటి ఆర్తీ అగర్వాల్ ను పిలిచి ఆడియో వేడుక ఘనంగా నిర్వహించాలని భావించామని 'ఆమె ఎవరు?' సినిమా దర్శకుడు రమేష్ ముగడ అన్నారు. ఆర్తీ అగర్వాల్ మృతిపై ఆయన మాట్లాడుతూ, ఆమె నటనతో సినిమాకు ప్రాణం పోశారని అన్నారు. కొత్త దర్శకుడిననే చిన్న చూపు లేకుండా తనతో కలిసిపోయేవారని, కొన్ని షాట్లు తీసినప్పుడు తన ప్రతిభను మెచ్చుకునేవారని ఆయన చెప్పారు. సినీ నిర్మాత కర్రి వీరగణేష్ మాట్లాడుతూ, సినీ నిర్మాణంలో ఆమె ఎంతగానో సహకరించారని అన్నారు. సీనియర్ నటి అయినప్పటికీ, కొత్త నిర్మాతననే భావన లేకుండా ఆమె ఎంతో ప్రోత్సహించారని చెప్పారు. ఆమె సహకారం లేకుంటే సినిమా ఇంత త్వరగా పూర్తయ్యేది కాదని ఆయన వెల్లడించారు. అంత మంచి నటిని కోల్పోవడం బాధాకరమని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని 'ఆమె ఎవరు' సినిమా యూనిట్ పేర్కొంది.