: రాజధాని భూమి పూజలా లేదు...చంద్రబాబు ఇంటి పూజలా ఉంది: రామచంద్రయ్య
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి జరిగిన భూమిపూజపై తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఉద్దేశించిన భూమిపూజను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంతింటి భూమిపూజలా నిర్వహించారని శాసనమండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య విమర్శించారు. కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షాలను ఆహ్వానించకుండా రాజధాని భూమి పూజ నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం అంటే చంద్రబాబు అదేదో సొంతింటి వ్యవహారం అన్నట్టు ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వంటి వారు ప్రతిపక్షానికి సరైన గుర్తింపు ఇచ్చారన్న విషయం మరువకూడదని ఆయన చెప్పారు. చంద్రబాబు కేవలం సొంతింటివారితో భూమి పూజ నిర్వహించడం సమంజసమా? అని అడిగారు. రాజధాని నిర్మాణమా? లేక ప్రైవేటు కార్యక్రమమా? అని ఆయన ప్రశ్నించారు.