: ఆర్తీ అగర్వాల్ మంచి అమ్మాయి...ఇది దురదృష్టం: కోన, సురేష్ బాబు
ఆర్తీ అగర్వాల్ చాలా మంచి అమ్మాయని ప్రముఖ సినీ నిర్మాత సురేష్ బాబు తెలిపారు. ఆర్తీ అగర్వాల్ మృతిపై ఆయన మాట్లాడుతూ, ఇలాంటి వార్త వినడం చాలా దురదృష్టమని అన్నారు. తెలుగునాట తను నిర్మించిన 'నువ్వునాకు నచ్చావ్' సినిమాతో అరంగేట్రం చేసిందని, ఆ సినిమా చేసినప్పుడు చాలా రిజర్వుడుగా, పద్ధతిగా ఉండేదని అన్నారు. మానవ సంబంధాలు, సినిమా సంబంధాల మధ్య దూరం చెరిపేయకపోతే చాలా కష్టమని ఆయన చెప్పారు. సినిమాలే జీవితం కాదని, జీవితంలో సినిమాలు ఓ భాగమని భావిస్తే ఇలాంటి వార్తలు వినమని ఆయన చెప్పారు. కారణాలేవైనా, చిన్న వయసులోనే ఎంతో భవిష్యత్ ఉన్న ఆర్తీ అగర్వాల్ మృతి చెందడం తనను కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. మాటల రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ, ఆర్తీ అగర్వాల్ భలే హుషారుగా ఉంటుందని అన్నారు. పరిచయం కాకపోతే చాలా రిజర్వ్ డ్ గా ఉంటుందని, పరిచయమైపోతే ఎలాంటి భేషజాలు లేకుండా ఉండేదని గుర్తు చేసుకున్నారు. చాలా త్వరగా కలిసిపోతుందని, ఇంట్లో అమ్మాయిలా మెలుగుతుందని కోన వెంకట్ చెప్పారు. అంత మంచి అమ్మాయి మరణించిందని వినడం ఆవేదన కలిగిస్తోందని ఆయన వెల్లడించారు. నటినటులు మానసిక నిబ్బరం కలిగి ఉండాలని ఆయన సూచించారు.