: అమితాబ్ సలహాతో సినిమా గడప తొక్కి, అంతలోనే నిష్క్రమించింది!


ఆర్తి అగర్వాల్ అమెరికాలోని న్యూజెర్సీలో 1984లో జన్మించింది. బాల్యం నుంచే డ్యాన్స్ బాగా చేసేది. ఆమెకు 14 ఏళ్ల వయసున్నప్పుడు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి దృష్టిలో పడింది. ఫిలడెల్ఫియాలో ఓ కార్యక్రమంలో సునీల్ తనతోపాటు డ్యాన్స్ చేయాలని ఆర్తిని ఆహ్వానించడం విశేషం. ఆ కార్యక్రమానికి హాజరైన అమితాబ్ బచ్చన్ అక్కడ ఆర్తి ప్రదర్శన చూసి ముగ్ధుడయ్యారు. ఆర్తిని బాలీవుడ్ కు తీసుకురమ్మని ఆమె తండ్రి శశాంక్ అగర్వాల్ కు సూచించారు. అలా ఆమె 'పాగల్ పన్' చిత్రంతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది. అటుపై టాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకునేందుకు వచ్చింది. వెంకటేశ్ సరసన 'నువ్వు నాకు నచ్చావ్'తో తెలుగు గడప తొక్కిన ఆర్తి ఆ తర్వాత కొద్దికాలంలోనే టాప్ హీరోయిన్ల జాబితాలో చోటు సంపాదించింది. 2001 నుంచి 2005 వరకు స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది. నువ్వు లేక నేను లేను, సోగ్గాడు, నీ స్నేహం, వసంతం, ఇంద్ర, అడవిరాముడు, అందాలరాముడు, పల్నాటి బ్రహ్మనాయుడు... తదితర హిట్ చిత్రాలతో ఓ రేంజిలో దూసుకుపోయింది. అయితే, కెరీర్ మంచి ఊపుమీదున్నప్పుడు ఓ యువ హీరోతో ప్రేమాయణం బెడిసికొట్టింది. దాంతో, 2005లో ఆర్తి ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడే ఆమె కెరీర్ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో కనిపించినా మునుపటి స్టార్ డమ్ దక్కించుకోలేకపోయింది. 2007లో ఉజ్వల్ కుమార్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుని అమెరికా వెళ్లిపోయినట్టు కథనాలు వచ్చాయి. ఆ బంధం విఫలం కావడంతో విడాకులు తప్పలేదు. ఇటీవలే ఆమె రణం-2 అనే చిత్రంలో నటించింది. కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతుండడానికి తోడు, స్థూలకాయం కూడా ఆమెను కుంగదీసింది. చివరికి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచి అభిమానులను తీరని విషాదంలో ముంచెత్తింది.

  • Loading...

More Telugu News