: నేనేం చేశానో ఎల్లుండి చెబుతా: చంద్రబాబు
అధికారం చేపట్టిన తరువాత తొలి ఏడాది కాలంలో తాను ఏం చేశానన్న విషయాలపై ఎల్లుండి జరిగే 'మహా సంకల్ప సభ'లో సవివరంగా చెబుతానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. అమరావతి నిర్మాణానికి భూమిపూజ పూర్తయిన తరువాత వందలాది మంది రైతులు, ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, తాను ప్రమాణ స్వీకారం చేసిన ప్రదేశంలోనే మహా సంకల్ప సభా వేదిక ఏర్పాటవుతుందని, అదే వేదికపై ప్రగతి నివేదికను ప్రజల ముందు పెడతానని వివరించారు. కాగా, గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో గత సంవత్సరం బాబు ప్రమాణం చేసిన ప్రాంతంలో ఈనెల 8న సభ నిర్వహించేందుకు అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయమూ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.