: రామకృష్ణ హెగ్డే సీఎం పదవిని ఎలా కోల్పోయారన్న విషయం టీఆర్ఎస్ నేతలు తెలుసుకోవాలి: సోమిరెడ్డి


టీఆర్ఎస్ నేతలకు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే సీఎం పదవిని కోల్పోయిన విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. బెంగళూరులో ఆయన మాట్లాడుతూ... ఓటుకు నోటు వ్యవహారంపై గవర్నర్ సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కస్టడీలో ఉన్న రేవంత్ రెడ్డికి ఏదైనా హాని జరిగితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బెదిరించి టీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకున్నారని, ఈ ఫిరాయింపుల వ్యవహారంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదిలో 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనడం కేసీఆర్ రికార్డు అని ఎద్దేవా చేశారు. ఇక, జగన్ విషయానికొస్తూ... జగన్ తాజాగా 80 పేజీల పుస్తకం విడుదల చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. జగన్ అక్రమాలకు సంబంధించిన చార్జ్ షీట్లను లారీల్లో తరలించిన విషయం మర్చిపోయారా? అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ ఫ్యాన్ గుర్తు మార్చి సూట్ కేసు గుర్తు పెట్టుకోవాలని సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News