: అడవుల్లో పెట్టమన్నారు... రాజధాని అంటే మళ్లీ మళ్లీ కట్టుకునేది కాదు: చంద్రబాబు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మందడంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భవిష్యత్తుపై మాట్లాడారు. కొందరు పెద్దలు రాజధానిని అడవుల్లో పెట్టమన్నారని తెలిపారు. అయితే, రాజధాని అంటే మళ్లీ మళ్లీ కట్టుకునేది కాదని, అందుకే అనువైన ప్రదేశంలో, భారీ స్థాయిలో నిర్మాణానికి పూనుకున్నామని వివరించారు. రాజధాని వల్ల తమకు పేరొస్తుందని కొందరు అసూయపడుతున్నారని విమర్శించారు. కొందరు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అంతేగాకుండా, తన ప్రసంగంలో రైతులను పదేపదే ప్రస్తావించారు. "భూసమీకరణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. భూసమీకరణను ఆమోదించిన రోజును నా జీవితంలో మర్చిపోలేను. అన్ని విషయాల్లోనూ భూములిచ్చిన రైతులకే అగ్రతాంబూలం. రాజధానికి దేవతల రాజధాని అమరావతి పేరు పెట్టాం. ఎవరు అడ్డంకులు ఏర్పరచినా రాజధాని నిర్మాణం ఆగదు. మేం నిర్మించే రాజధాని సింగపూర్ కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రపంచంలోనే నెంబర్ వన్ రాజధాని నిర్మించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానిదే. 21వ శతాబ్దం రాజధానిని నిర్మించి తీరుతాం. ఆ రాజధాని విద్యానగరి కావాలి. మన పిల్లలు విదేశాలకు వెళ్లడం కాదు, విదేశీ విద్యార్థులు ఇక్కడికి రావాలి. పేరు, స్థల మహిమ కొత్త రాజధానికి కలిసొస్తుందని భావిస్తున్నాం. రాజధానిని నిర్మించే అవకాశం అందరికీ రాదు" అని ఉద్ఘాటించారు. ఇక, విభజన తీరును మరోసారి దుయ్యబట్టారు. "తెలుగుజాతి కలిసుండాలనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. కానీ, తెలుగుజాతి ఉనికికే కాంగ్రెస్ ప్రమాదం తెచ్చిపెట్టింది. రాజకీయ స్వార్థం కోసం మన పొట్టకొట్టాలని చూసింది. ఆస్తులు, అప్పుల పంపకాల్లోనూ హేతుబద్ధతలేదు. రాష్ట్రాన్ని విడగొట్టారు... రాజధాని ఎక్కడో చెప్పలేదు. అలాంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మించుకునే అవకాశం 5 కోట్ల తెలుగు ప్రజలకు వచ్చింది. రాజధాని నిర్మాణంలో మొదటి కూలీని నేనే" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News