: హైదరాబాదులా వద్దు... సింగపూర్ లా చేయండి: చంద్రబాబుకు ఓ బాలిక సూచన
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని భూమిపూజలో పాల్గొన్నారు. అనంతరం మందడంలో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా, తిరుపతికి చెందిన ఓ బాలిక స్కేటింగ్ చేసుకుంటూ రాజధాని ప్రాంతానికి చేరుకుని, తన హుండీని రాజధాని నిర్మాణం కోసం అందించింది. తన ఖర్చుల కోసం పొదుపు చేసిన డబ్బును రాజధాని కోసం ఇచ్చేసిన ఆ చిన్నారిని చంద్రబాబు హృదయపూర్వకంగా అభినందించారు. అనంతరం ఆ చిన్నారిని ఎందుకు హుండీ తీసుకొచ్చావు? అని అడిగారు. అందుకా బాలిక... "రాజధాని కోసం" అంటూ జవాబిచ్చింది. ఏపీని హైదరాబాదులా తయారుచేయవద్దని, సింగపూర్ లా తయారుచేయాలని కోరింది. అది విన్న చంద్రబాబు చిరునవ్వు నవ్వారు.