: రేవంత్ నోరు విప్పేనా?... కస్టడీకి తీసుకున్న ఏసీబీ
ఈ ఉదయం చర్లపల్లి జైలుకు చేరుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలుగుదేశం పార్టీ నేత, ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో సాక్ష్యాలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డిని నాలుగు రోజుల కస్టడీ నిమిత్తం తీసుకువెళ్లారు. అంతకుముందు కోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీని జైలు అధికారులకు అందించారు. నేటి నుంచి 9వ తేదీ సాయంత్రం వరకూ ఏసీబీ అధికారులు రేవంత్ ను ప్రశ్నించవచ్చు. 9న సాయంత్రం 4 గంటలకు రేవంత్ ను తిరిగి కోర్టుకు హాజరు పరచాల్సి వుంటుంది. కస్టడీలోకి తీసుకున్న రేవంత్ ను బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి అధికారులు తరలించారు. ఆయనతో పాటు ఇదే కేసులో అరెస్టయిన సెబాస్టియన్, ఉదయ్ సింహాలను కూడా అదే కార్యాలయానికి తీసుకువెళ్లారు. కాగా, రేవంత్ నోటి నుంచి పలు నిజాలు చెప్పించేందుకు ఏసీబీ ప్రత్యేక ప్రశ్నావళిని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన నోరు విప్పకుంటే ఏం చేయాలన్న విషయంలోనూ తమకు స్పష్టత ఉందని ఓ అధికారి వెల్లడించారు.