: రామచంద్రారెడ్డీ... నీ వెంటబడతా: కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హైదరాబాదులో శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బంజారాహిల్స్ లోని ఎన్ బీటీ నగర్ లో ఓ భారీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఆ ప్రాంతంలో ఇంతకుముందు మల్లమ్మ అనే వృద్ధురాలు నివాసం ఉండేది. ఇప్పుడు అక్కడ భవనం కడుతుండడంతో ఆమె గుడిసెను తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే, మల్లమ్మ ఇంటిని తొలగించవద్దని సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. ముందు ఆమెకు ఇల్లు కట్టించాలని సూచించారు. ఈ సందర్భంగా, ఆయన సరదాగా మాట్లాడారు. ఎన్ బీటీ నగర్లో మొదట మల్లమ్మకే ఇల్లు కట్టివ్వాలని, ఆ తర్వాతే మిగతా ఇళ్ల నిర్మాణం జరగాలని, ఇందులో ఏమైనా తేడా వస్తే... "రామచంద్రారెడ్డీ నీ వెంటబడతా" అంటూ ఎమ్మెల్యేని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక, మల్లమ్మ అయితే కేసీఆర్ కు రెండు చేతులూ జోడించి నమస్కారం చేసి, ఆయనను కీర్తించింది.