: మంత్రి పీతల సుజాత 'నోట్ల కట్టల' కష్టాలు తొలగిపోయాయి!
ఏపీ మంత్రి పీతల సుజాత ఇంట్లో రూ.10 లక్షలు కనిపించడం, సంచలనం సృష్టించడం తెలిసిందే. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉదంతంతో తీవ్రంగా కలత చెందిన టీడీపీ అధినాయకత్వం, పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలోని సుజాత ఇంట్లో డబ్బు సంచీ దొరకడంతో ఉలిక్కిపడింది. అటు, పీతల సుజాత కూడా ఈ ఘటనతో వేదనకు గురయ్యారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు జరిపారు. దీనిపై డీఎస్పీ సౌమ్యలత మాట్లాడుతూ... మంత్రి పీతల సుజాత నివాసంలో నోట్ల కట్టలపై విచారణ ముగిసిందని చెప్పారు. అక్కడ సంచీ వదిలివెళ్లిన విష్ణువతి ఉద్యోగం కోసం మాట్లాడేందుకు రాలేదని, మామూలుగానే వచ్చారని వివరించారు. అయితే, ఆమె నగదును మంత్రి నివాసంలో మర్చిపోయి వెళ్లారని తెలిపారు. విష్ణువతి ఎస్ బీఐ నుంచి డబ్బు డ్రా చేసినట్టు ఆధారం ఉందని చెప్పారు. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు ఆధారాలు లేవని అన్నారు. విష్ణువతికి ఆ నగదును అప్పగిస్తామని స్పష్టం చేశారు.