: పియూష్ గోయల్ ఎందుకు వచ్చారు?... చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య రాయబారానికా?: అంబటి
ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు కూడా రావడంతో... ఆయన రక్షణ చర్యలకు ఉపక్రమించారని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు పట్టుకుని చంద్రబాబు బయటపడాలనుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ హైదరాబాదుకు వస్తున్న విషయం హైదరాబాదులోని బీజేపీ నేతలకు కూడా తెలియదని... ఆయన ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య రాయబారం నెరపడానికి వచ్చారా? అని నిలదీశారు. టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా వారు చేసిన తప్పును ఒప్పుకోవాలని అన్నారు.