: చివరి గంటలో అమ్మకాల వెల్లువ, నష్టపోయిన సిమెంట్, బ్యాంకింగ్ సంస్థలు
సెషన్ ఆరంభంలో నష్టాలు ఉన్నా మధ్యాహ్నం తరువాత లాభాల్లోకి వెళ్లినప్పటికీ, చివరి గంట వ్యవధిలో నమోదైన అమ్మకాలు బెంచ్ మార్క్ సూచికలను నష్టాల్లోకి దిగజార్చాయి. మధ్యాహ్నం 2:50 గంటల సమయంలో 27 వేల పాయింట్ల కన్నా ఎగువన ఉన్న సెన్సెక్స్ 50 నిమిషాల తరువాత సుమారు 230 పాయింట్లు పడిపోయింది. సిమెంట్, బ్యాంకింగ్ సంస్థలు భారీగా నష్టపోయాయి. శుక్రవారం నాటి సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక క్రితం ముగింపుతో పోలిస్తే 44.93 పాయింట్లు పడిపోయి 0.17 శాతం నష్టంతో 26,768.49 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 15.19 పాయింట్లు పడిపోయి 0.20 శాతం నష్టంతో 8,114.70 పాయింట్ల వద్దా కొనసాగాయి. ఎన్ఎస్ఈ-50లో 19 కంపెనీలు లాభపడగా, 30 కంపెనీలు నష్టపోయాయి. కోల్ ఇండియా, జీ ఎంటర్ టెయిన్ మెంట్, ఎన్ఎండీసీ, గెయిల్, ఐడియా తదితర కంపెనీలు లాభపడగా, అంబుజా సిమెంట్స్, ఏసీసీ, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీలు నష్టపోయాయి.