: నల్లగొండ జిల్లాలో మరో ‘ఉగ్ర’ కలకలం... కానిస్టేబుళ్లపై తుపాకీ గురిపెట్టిన ముష్కరులు
సూర్యాపేట బస్టాండ్ లో పోలీసులపై ఉగ్రవాదుల కాల్పులు, తదనంతరం ‘ఉగ్ర’ వేట సాగించిన పోలీసు ఆపరేషన్ తో నల్లగొండ జిల్లాలో ఇటీవల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాటి ఘటన మాదిరిగానే మరో ఘటన గత నెల 26న జరిగింది. అయితే పోలీసులు ఈ ఘటనను గోప్యంగా ఉంచగా, తాజాగా వెలుగు చేసింది. వివరాల్లోకెళితే.. జిల్లాల్లోని నకిరేకల్ లో ఉగ్రవాదుల సంచారంపై సమాచారం అందుకున్న పోలీసులు సివిల్ డ్రెస్ లో వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలో పట్టణంలోని ఆపీసర్స్ కాలనీ సమీపంలో ఇద్దరు యువకులు బైక్ పై సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అటుగా వెళ్లారు. ఈ క్రమంలో యువకుల బైక్ ను పోలీసుల బైక్ ఢీకొంది. దీంతో బైక్ తిరుగుతున్న యువకులు కిందపడిపోగా, వారిలోని ఓ యువకుడి కాలు బైక్ చక్రంలో ఇరుక్కుపోయింది. ఇదే అదనుగా వారిని పట్టుకునేందుకు ఓ కానిస్టేబుల్ యత్నించాడు. దీంతో తేరుకున్న మరో యువకుడు సదరు కానిస్టేబుల్ పైకి తుపాకీ గురిపెట్టాడట. సూర్యాపేట షూటర్స్ ఉదంతం గుర్తుకువచ్చిన కానిస్టేబుళ్లు ప్రాణభయంతో కాలనీలోకి పరుగులు పెట్టారట. ఆ తర్వాత ఆ యువకులిద్దరూ తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. తప్పించుకున్న యువకులిద్దరూ ఉగ్రవాదులేనని పోలీసులు అనుమానిస్తున్నారు.