: చంద్రబాబు కొత్త ప్లాన్... రూ.100కే ఇంటర్నెట్, మొబైల్, కేబుల్ టీవీ
ఈ సంవత్సరం డిసెంబరు నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంటికీ ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్ ఇచ్చే పనులను మొదలు పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. దీనివల్ల పలురకాల సాంకేతిక సేవలు అతి తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయని, ప్రాంతాన్ని బట్టి రూ. 100 నుంచి రూ. 150 ఖర్చుతో ఇంటర్నెట్, మొబైల్, టెలివిజన్ చానళ్ల ప్రసారాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన జన్మభూమి సభలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం కేబుల్ టీవీ చూడటానికి నెలకు రూ. 200 వరకూ ఖర్చు చేస్తున్నారని వెల్లడించిన ఆయన, ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్ ఏర్పడితే వివిధ సేవలను పొందవచ్చని అన్నారు. ఈ కనెక్షన్ల ఏర్పాటుకు గ్రామాల్లోని కరెంటు స్తంభాలను వినియోగించుకుంటామని, పలు ప్రాంతాల్లో భూగర్భ లైన్లు వేస్తామని తెలిపారు. ఈ మొత్తం కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం రూ. 5 వేల కోట్లను అందిస్తోందని తెలిపారు.