: ఎల్లుండి నుంచి కడపకు కొత్త కళ... అందుబాటులోకి విమాన సేవలు
శ్రీవెంకటేశ్వరుడు కొలువైన తిరుమల గిరులకు తొలి గడపగా చెప్పుకునే కడప కొత్త కళను సంతరించుకోనుంది. వాణిజ్యపరంగా విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 7న కడప విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నట్టు పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుతో పాటు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఇతర మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు. తొలి సర్వీసుగా బెంగళూరు నుంచి బయలుదేరి వచ్చే విమానం ఉదయం 11:30 గంటలకు కడపలో దిగనుంది. ఈ విమానానికి వాటర్ క్యానన్లతో స్వాగతం పలకనున్నారు. అనంతరం కడప నుంచి తొలి సర్వీసుగా ఇది బెంగళూరుకు బయలుదేరుతుంది. సుమారు రూ. 42 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ విమానాశ్రయంలో ఏటీఆర్-72 తరహా విమానాలు రాకపోకలు సాగించవచ్చు. భవిష్యత్తులో పెరిగే ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా ఏ-320 విమానాల రాకపోకలకు అనువుగా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.