: సినిమా చూస్తే తెలుస్తుంది, చార్మీతోనే ఎందుకు చేశానో!: పూరీ జగన్నాథ్
హైదరాబాదులో జరిగిన 'జ్యోతిలక్ష్మీ' సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ మాట్లాడారు. ఈ సినిమాను చార్మీతోనే ఎందుకు చేశానో సినిమా చూస్తే తెలుస్తుందన్నారు. ఆమె తన పాత్రను అద్భుతంగా పోషించిందన్నారు. ప్రతి సీన్ లోనూ ఎనర్జెటిక్ గా నటించిందని తెలిపారు. సీన్ పూర్తవ్వగానే చార్మి, నిర్మాతగా మారిపోయి ప్రొడక్షన్ పనులు చూసుకునేదని, సిబ్బందిపై కస్సుబుస్సులాడుతూ సిసలైన నిర్మాతలా వ్యవహరించేదని చెప్పుకొచ్చారు. ఇక, చిత్ర కథ గురించి చెబుతూ... ఎప్పుడో 45 ఏళ్ల క్రితం మల్లాది వెంకట కృష్ణమూర్తి ఓ నవల రాశారని, దాని పేరు మిసెస్ పరాంకుశం అని తెలిపారు. పాతికేళ్ల క్రితం తాను మల్లాది వద్దకు వెళ్లి, తాను దర్శకుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నానని, ప్రస్తుతం డబ్బులు ఇచ్చుకోలేనని, కానీ, కథను మాత్రం తనకోసం అట్టిపెట్టాలని కోరానని వివరించారు. పదేళ్ల తర్వాత మళ్లీ ఆయన వద్దకు వెళ్లానని, అప్పటికే దర్శకుడిని అయ్యానని చెప్పారు. తానెక్కడకి వెళ్లినా ఆ నవల కూడా తనతోనే ఉండేదని తెలిపారు. ఆ కథతోనే ఈ జ్యోతిలక్ష్మీ చిత్రాన్ని రూపొందించామని చెప్పారు.