: మ్యాగీ ప్రకటనల్లో నటించిన వారిపై కేసులు పెట్టడం సరికాదు: శివసేన
మ్యాగీ నూడిల్స్ లో మోతాదుకు మించి హానికర పదార్థాలున్నాయంటూ పలు రాష్ట్రాల్లో నిషేధం విధించడం తెలిసిందే. మ్యాగీ వాణిజ్య ప్రకటనల్లో నటించిన బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతి జింతా న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై శివసేన స్పందించింది. నటులకు మద్దతుగా నిలిచింది. శివసేన అధికార ప్రతినిధి నీలమ్ గోర్హే మాట్లాడుతూ... "మ్యాగీ తయారీదారు నెస్లే గురించిన విషయాలు చిన్నారుల తల్లిదండ్రులను, వినియోగదారులను తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. క్వాలిటీ కంట్రోల్ విభాగం ఏం చేస్తున్నట్టని లక్షలాది ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇది నిజంగా ప్రభుత్వాలకు మేలుకొలుపు వంటిదే. నటులపై న్యాయపరమైన చర్యలు సరికాదు. ఏదేమైనా, ప్రచారకర్తలు, మోడళ్లు, నటులు ఉత్పత్తుల ప్రచారానికి ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతో ఉంది" అని పేర్కొన్నారు.