: రేవంత్ రెడ్డి కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్... రేపటికి విచారణ వాయిదా


టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు అనుచరులు ఉదయ్ సింహ, సెబాస్టియన్ లను కూడా కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరారు. రేవంత్ ను విచారించేందుకు సమయం సరిపోలేదని, డబ్బుల వ్యవహారంలో కుట్ర కోణం ఉందని, ఎమ్మెల్యేకు రూ.50 లక్షలు ఇచ్చి రూ.4.5 కోట్లు తర్వాత ఇస్తానన్నారని కస్టడీ పిటిషన్ లో ఏసీబీ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి కాల్ డేటా రికార్డులను పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. ఎమ్మెల్యేకు నగదు ఇవ్వకముందు రేవంత్ పలుచోట్ల సమావేశమయ్యారని, వాటి వివరాలు తెలుసుకోవాలని కోర్టుకు తెలిపింది. అందుకే ఐదు రోజులు కస్టడీకి ఇస్తే పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ వివరించింది. వెంటనే పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు, కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్ లాయర్లను ఆదేశించింది. దాంతో తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ను ఏసీబీ డీజీ ఏకే ఖాన్ కలసిన తరువాత కస్టడీ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. మరోవైపు రేపు రేవంత్ బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. నోటుకు ఓటు కేసులో అరెస్టైన రేవంత్ ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉన్నారు.

  • Loading...

More Telugu News