: పోలీసులను కొట్టిన జగ్మోహన్ దాల్మియా 'మైనర్' మనవడు
ఆ బాలుడి పేరు ఆదిత్య దాల్మియా. వయసు 15 సంవత్సరాలు. బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మనవడు. చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడో ఏమో... పోలీసులను కొట్టిన కేసులో అరెస్టయ్యాడు. ఈ ఘటన కోల్ కతాలోని అవిషిక్త పరిధిలో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ నోపార్కింగ్ జోన్ లో ఆదిత్య ప్రయాణిస్తున్న కారు నిలిచివుంది. అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కారును తీసివేయాలని కోరాడు. కారును తొలగించే క్రమంలో సైతం రాంగ్ రూటులో కారు వెళ్లడాన్ని గమనించి కారును ఆపగా, ఆదిత్య కారు దిగి కానిస్టేబుల్ ను కొట్టాడు. దీన్ని గమనించిన ఓ ఎస్ఐ పరిస్థితిని చక్కదిద్దేందుకు వచ్చి ఆదిత్యను వారించాలని చూసినా వినలేదు. అక్కడే ఉన్న ఇతర అధికారులు వచ్చి ఆదిత్యను పక్కకు తీసుకెళ్లాల్సి వచ్చింది. విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై చెయ్యి చేసుకున్నాడని ఆదిత్యపై కేసు పెట్టిన పోలీసులు అతని వయసు చూసి ఆశ్చర్యపోయారు. నిన్న రాత్రంతా కస్టడీలో ఉంచిన పోలీసులు నేడు బాల నేరస్తుల న్యాయస్థానం ముందు ఆదిత్యను హాజరు పరచనున్నట్టు వివరించారు.