: మరోసారి నిరసన చేయాలనుకుంటున్న 'లింగా' డిస్ట్రిబ్యూటర్స్
నటుడు రజనీకాంత్ కు 'లింగా' చిత్రం మిగిల్చిన నష్టం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ సినిమాను కొని భారీగా నష్టపోయిన పంపిణీదారులు తమకు రావల్సిన నష్టపరిహారం కోసం మరోసారి నిరసన చేయాలని అనుకుంటున్నారు. గతంలో పంపిణీదారులు నిరసన చేసినప్పుడు రూ.12.5 కోట్లు ఇస్తానని రజనీకాంత్ ఒప్పుకున్నారు. అందులో కేవలం రూ.6 కోట్లు మాత్రమే డిస్ట్రిబ్యూటర్లకు అందాయి. దాంతో రావల్సిన మిగతా సొమ్ము కోసం రజనీ కార్యాలయం ఎదుట ఆందోళన చేయాలనుకుంటున్నట్టు డిస్ట్రిబ్యూటర్ సింగారవేలన్ చెప్పాడు. అందుకే ఈ విషయంలో రజనీ సార్ జోక్యం చేసుకుని వారంలోగా సెటిల్ చేయాలని కోరుకుంటున్నామన్నారు. రావల్సిన దానికంటే డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు రూ.15 కోట్లు ఎక్కువగా అడుగుతున్నారని మరో డిస్ట్రిబ్యూటర్ తిరుప్పూర్ సుబ్రమణ్యం పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో 'లింగా' నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, నష్టాన్ని తాను కూడా భరిస్తానని హామీ ఇచ్చిన రజనీల నుంచి తమ నగదు కోసం ఎదురు చూస్తున్నామని వివరించాడు.