: చూపుడువేలిపై ఇకనుంచి మరింత పెద్దగా ఇంకు గుర్తు: ఈసీ
పోలింగ్ సమయంలో ఓటు వేసినట్టు రుజువు కోసం చూపుడువేలుపై సిరాగుర్తు పెడతారని తెలిసిందే. ఇకపై ఆ గుర్తు మరింత పెద్దగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్రష్ తో సిరాను వేలిపై రుద్దాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎడమ చేతి చూపుడు వేలిపై బ్రష్ తో సిరాను గోరు భాగం నుంచి మొదటి కీలు కింది దాకా రుద్దాలని ఆదేశాల్లో పేర్కొంది. ఎన్నికల అధికారులు ఓటర్లకు సిరా గుర్తును సరిగ్గా పెట్టడం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. బ్రష్ ను ఉపయోగించడం వల్ల సిరా గుర్తు మందంగా, పెద్దగా, స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం బాధ్యతను పర్యవేక్షించే ఎన్నికల అధికారి ఓటు వేయడానికి ముందే ఓటరు వేలిపై సిరాగుర్తు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు, రిటర్నింగ్ అధికారులకు పంపుతారు.