: రేవంత్ ను ఇంకా కస్టడీకి అడగని ఏసీబీ... ఎందుకంటే..!
రూ. 50 లక్షల నగదు, పక్కా ఆడియో, వీడియో సాక్ష్యాలు సహా పట్టుబడిన తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి అరెస్టై ఐదు రోజులు గడుస్తున్నా, అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ నిమిత్తం ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని ఇంకా పిటిషన్ దాఖలు చెయ్యకపోవడానికి కారణమేంటని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ కేసులో ఆయన ఫోన్ సంభాషణలు అత్యంత కీలకమని భావిస్తున్న ఏసీబీ, కస్టడీకి అడిగేముందే పూర్తి ఆధారాలు, ఈ మొత్తం ఘటన వెనుక ఎవరెవరున్నారు? తదితర విషయాలు తెలుసుకోవాలని భావిస్తోందని తెలుస్తోంది. రేవంత్ కు డబ్బెవరిచ్చారు? స్టీఫెన్ సన్ తో ఎంతకాలం నుంచి సంప్రదించారు? ఎవరెవరు సంప్రదించారు? 'బాస్' స్టీఫెన్ తో మాట్లాడారా? వంటి సమాచారాన్ని సేకరించే పనిలో బిజీగా ఉన్నారు. ఓ ప్రజాప్రతినిధిగా ఉన్న రేవంత్ వెంట అనుక్షణమూ ఉండాల్సిన భద్రతా సిబ్బంది ఆయన అరెస్ట్ అయిన సమయంలో పక్కన లేకపోవడాన్నీ విచారిస్తున్నారు. కస్టడీకి తీసుకుంటే రేవంత్ ను ఏఏ ప్రశ్నలు వేయాలి? ఆయన్నుంచి ఎలా సమాధానాలు రాబట్టాలి? వంటి అంశాలపైనా ఏసీబీ అధికారులు కసరత్తు జరుపుతున్నారు. అందువల్లే కస్టడీకి కోరే విషయమై ఏసీబీ తొందరపడడం లేదని అధికారులు అంటున్నారు.