: బ్రిటన్ రాణి మరణించారంటూ బీబీసీ ట్వీట్... ఆపై క్షమాపణ
ప్రపంచ ప్రఖ్యాత న్యూస్ ఏజన్సీ, రేడియో ప్రసారాల సంస్థ బీబీసీ (బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్) ఓ పెద్ద తప్పు చేసింది. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 మృతి చెందారంటూ ట్వీట్ చేసింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. వెంటనే అప్రమత్తమైన బీబీసీ, తాము తప్పు చేశామని క్షమాపణ చెబుతూ, ఆ ట్వీట్‌ను తొలగించింది. అసలేం జరిగిందంటే, ఒకవేళ రాజకుటుంబంలో ఎవరైనా మరణిస్తే ఎంత అప్రమత్తంగా ఉండాలి? ఏం చెయ్యాలి? ఆ వార్తలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి? అనే అంశాలపై అంతర్గతంగా అభ్యాసన జరుగుతున్న సమయంలో అమీన్ ఖవాజా అనే మహిళా జర్నలిస్టు ఈ ట్వీట్ చేసింది. క్వీన్ ఎలిజబెత్ వార్షిక వైద్యపరీక్షల నిమిత్తం బుధవారం నాడు లండన్ లోని ఆసుపత్రికి వచ్చి వెళ్లారు. కాగా, ప్రస్తుతం 89 ఏళ్ల వయసులో ఉన్న ఎలిజబెత్-2 ఆరోగ్యంగానే ఉన్నారని బకింగ్ హామ్ ప్యాలెస్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.