: గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయం ముందు వైకాపా నేతల బైఠాయింపు
వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలు గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయం ముందు బైఠాయించారు. ఈ రోజు మంగళగిరిలో తమ అధినేత జగన్ చేపట్టిన సమరదీక్షకు సరైన భద్రత కల్పించలేదని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. తగిన భద్రత కల్పించాలని కోరేందుకు వైకాపా నేతలు ఎస్పీ కార్యాలయానికి వెళ్లగా... ఎస్పీ త్రిపాఠి అందుబాటులో లేకుండా పోయారు. ఈ క్రమంలో ఎస్పీకి నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఫోన్ చేయగా... తాను మీటింగ్ లో ఉన్నానని, వచ్చేసరికి రాత్రి 11 గంటలవుతుందని సమాధానమిచ్చారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన వైకాపా నేతలు ఎస్పీ కార్యాలయం ముందు బైఠాయించారు. ప్రతిపక్ష నేత దీక్షకు సరైన భద్రత కల్పించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.