: సంజయ్ దత్ కు శిక్ష వేసిన జడ్జి ఇప్పుడు బాలీవుడ్ నటుడు!
ముంబయి మహానగరం ఎన్నో ఆటుపోట్లు చవిచూసింది. ముఖ్యంగా, 1993 వరుస పేలుళ్లు ముంబయి వాసులకు ఎన్నో పీడకలలు మిగిల్చాయి. ఈ సందర్భంగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నివాసంలో ఆయుధాలు దొరకడం సంచలనం సృష్టించింది. దాంతో, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడంటూ సంజయ్ దత్ కు టాడా కోర్టు జైలు శిక్ష విధించింది. దానికి సంబంధించిన తీర్పు వెలువరించింది జస్టిస్ పీడీ కోడే. ఈ ఏడాదే ఆయన హైకోర్టు జడ్జిగా పదవీ విరమణ చేశారు. మామూలుగా రిటైర్ జడ్జ్ లు ఆర్బిట్రేటర్లుగానో, లేక, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ కో మొగ్గుచూపుతారు. కానీ, కోడే మాత్రం బాలీవుడ్ దిశగా అడుగులేశారు. ప్రస్తుతం ఆయన 'జేడీ' అనే సినిమాలో నటిస్తున్నారు. ఓ పాత్రికేయుడి జీవితంలో ఎదురైన సమస్యలే ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఇందులో కోడే తనకలవాటైన నల్లకోటు ధరించే పాత్రను పోషిస్తున్నారు. అంటే న్యాయమూర్తి అన్నమాట. ఆయన తన నటనతో యూనిట్ సభ్యుల అభినందనలు అందుకుంటున్నారట. దీనిపై కోడే మీడియాతో మాట్లాడుతూ... మీడియాకు, సమాజానికి ఎంతోకొంత తిరిగి ఇచ్చేందుకు లభించిన అవకాశమని పేర్కొన్నారు.