: నెల్లూరు జిల్లా వ్యాపారిని మింగేసిన చెన్నై పేకాట క్లబ్!


తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ పేకాట క్లబ్ నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యాపారిని పొట్టనబెట్టుకుంది. పేకాటలో సర్వం కోల్పోయిన సదరు వ్యాపారి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకెళితే... చెన్నైలోని టీ నగర్ జీఎన్ రోడ్డులో వెలసిన మహాలక్ష్మి క్లబ్ పేకాటకు అడ్డాగా మారింది. అక్కడి పోలీసులను మచ్చిక చేసుకున్న మహాలక్ష్మి క్లబ్ యథేచ్ఛగా పేకాటను నిర్వహిస్తోంది. పేకాట వ్యసనంగా మారిన నెల్లూరుకు చెందిన ఓ వ్యాపారి క్లబ్ లో తిష్ట వేశారు. క్రమంగా తెచ్చుకున్న డబ్బు, బ్యాంకులో దాచుకున్న డబ్బు పేకాటలో కోల్పోయాడు. వ్యాపారాన్నీ వదిలేసిన సదరు వ్యాపారి ఇంటిని కుదువ పెట్టి మరీ పోగొట్టుకున్న డబ్బును రాబట్టుకునే యత్నం చేశారు. అయితే ఆయన యత్నం ఫలించలేదు. ఇంటి తాకట్టుతో తెచ్చుకున్న డబ్బు కూడా పోయింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సదరు వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో సదరు వ్యాపారి సన్నిహితుల ఫిర్యాదు మేరకు టీ నగర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ క్లబ్ పై గత శనివారం దాడి చేయించారు. 23 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు క్లబ్ ను సీజ్ చేశారు. అయితే పోలీసు శాఖతో సత్సంబంధాలు కలిగిన సదరు క్లబ్ అదే రోజు తిరిగి తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఇదిలా ఉంటే, ఈ క్లబ్ లో పేకాడి సర్వం కోల్పోయిన ఓ వ్యక్తి, తన భార్య నగలు కూడా అమ్మి పేకాటలో కాజేశాడు. దీంతో ఆయన భార్య ఆత్మహత్య చేసుకుందట.

  • Loading...

More Telugu News