: మంత్రి పీతల సుజాత ఇంటిలో రూ.10 లక్షల క్యాష్ బ్యాగ్... ప్రత్యర్థుల పనేనంటున్న మంత్రి
పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలోని ఏపీ మంత్రి పీతల సుజాత ఇంటిలో నిన్న సాయంత్రం ఓ బ్యాగ్ కలకలం రేపింది. స్థానికంగా ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిన్న వీరవాసరం వచ్చిన మంత్రి, సదరు కార్యక్రమం పూర్తైన వెంటనే హైదరాబాదు బయలుదేరారు. అయితే మంత్రిని కలవడానికి ఆమె ఇంటికి వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి నుంచి వెళుతూ ఓ బ్యాగ్ ను వదిలి వెళ్లారు. తీరా ఆ బ్యాగును గమనించిన పనిమనిషి, బ్యాగును తెరిచి చూసి రూ.10 లక్షల డబ్బును గుర్తించింది. వెంటనే మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. మంత్రి సూచనతో విషయం పోలీసులకు చేరిపోయింది. క్యాష్ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, రూ.10 లక్షల నగదుతో పాటు తాడేపల్లిగూడెం అడ్రెస్ తో వి.లక్ష్మి పేరిట డీఎస్సీ హాల్ టికెట్ లభించింది. తనను అప్రతిష్ఠ పాలుచేసేందుకే తన ప్రత్యర్థులు ఆ బ్యాగును తన ఇంటివద్ద వదిలి వెళ్లి ఉంటారని మంత్రి ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి సూచించినట్లు మంత్రి సుజాత చెప్పారు.