: ఈ ‘ఎర్ర’ స్మగ్లర్... చైనాలో మెకానికల్ ఇంజినీర్... నెట్, మొబైల్స్ తోనే స్మగ్లింగ్!
ఎర్రచందనం అక్రమ రవాణాలో అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్ గా పేరుగాంచిన చైనా దేశస్థుడు చెన్యీ ఫియాన్ ను గత శుక్రవారం చిత్తూరు జిల్లా పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేసిన సంగతి విదితమే. ఆ తర్వాత అతడి గురించిన వివరాలు తెలుసుకున్న పోలీసులు షాక్ కు గురయ్యారట. కేవలం ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ల ఆధారంగానే అతగాడు నడిపిన స్మగ్లింగ్... పేరుమోసిన స్మగ్లర్లనే నివ్వెరపరిచేలా ఉందని పోలీసులు చెబుతున్నారు. వివరాల్లోకెళితే... చైనా పట్టణం జియాన్ మెన్ కు చెందిన ఫియాన్, మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. భార్య, ఇద్దరు పిల్లలున్న ఫియాన్, చదివింది మెకానికల్ ఇంజినీరింగే అయినా, ఎలక్ట్రానిక్స్ పై మంచి పట్టు సాధించాడు. విద్యాభ్యాసం ముగిసిన తర్వాత చిన్నచిన్న వ్యాపారాలు చేసిన ఫియాన్, తొలుత ఎర్రచందనం గురించి ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నాడు. చైనాలో ఎర్రచందనానికి ఉన్న డిమాండ్ ఆధారంగా స్మగ్లింగ్ లోకి కాలిడాడు. మొబైల్ సహకారంతో బెంగళూరు, ఢిల్లీ, మైసూరు, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, హర్యానాల్లోని పలువురు స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. అవే పరిచయాలతో భారత్ లోని పలు ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకున్నాడు. భారత్ నుంచి తరలించే ఎర్రచందనం దుంగల కోసం చైనాలో ఓ గోడౌన్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత మొబైల్ ఫోన్ల ఆధారంగానే కార్యకలాపాలు సాగించాడు. కోట్లకు పడగలెత్తాడు. ఎర్రచందనం అక్రమ రవాణాతో పాటు ఎర్రచందనంతో చేసిన బొమ్మలను విక్రయించే వ్యాపారాన్ని కూడా ఫియాన్ నిర్వహిస్తున్నాడు. ఏజెంట్లతో భేటీ కోసం ఢిల్లీకి వచ్చిన ఫియాన్ చిత్తూరు జిల్లా పోలీసులకు పట్టుబడిపోయాడు. ఇతగాడిని పోలీసులు రేపు చిత్తూరు కోర్టులో హాజరుపరచనున్నారు.