: ఏపీలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్...నవ్యాంధ్ర రాజధాని భూమిపూజపై సర్కారు మల్లగుల్లాలు
ఈ నెల 6న అమరావతిలో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం సుముహూర్తం నిర్ణయించింది. ఇంకా నాలుగు రోజులే సమయముండటంతో అధికారులు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ఈ కార్యక్రమంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏపీలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నేటి సాయంత్రం షెడ్యూల్ ప్రకటించింది. అంతేకాక ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసినట్లేనని ప్రకటించింది. నవ్యాంధ్ర రాజధాని రూపుదిద్దుకోనున్న గుంటూరు జిల్లాల్లోనూ ఎన్నికల కోడ్ కూసింది. దీంతో నవ్యాంధ్ర రాజధాని భూమిపూజ, అనంతరం బహిరంగ సభ నిర్వహించాలని సంకల్పించిన ప్రభుత్వం డైలమాలో పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా, అప్పటికి ముందే ప్రకటించిన కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్నికల కమిషన్ కు లేఖ రాయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారమే నడుచుకుంటామని గుంటూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కాంతిలాల్ దండే పేర్కొన్నారు. మరి నవ్యాంధ్ర రాజధాని భూమిపూజ నిర్దేశిత సమయంలోనే జరుగుతుందా? లేక, వాయిదా పడుతుందా? అన్న విషయాన్ని ఎన్నికల సంఘం తేల్చాల్సి ఉంది.