: ఒకవైపు వడ్డీల తగ్గింపు, మరోవైపు వర్షాభావం... లక్ష కోట్ల సంపద ఆవిరి!
వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయానికి తోడు ఈ సంవత్సరం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వచ్చిన ప్రకటన ఇన్వెస్టర్ల సెంటిమెంటును హరించివేసింది. దీంతో స్టాక్ మార్కెట్ పాతాళానికి పడిపోయింది. సుమారు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడిదారుల సంపద హారతి కర్పూరమైంది. మంగళవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 660.61 పాయింట్లు పడిపోయి 2.37 శాతం నష్టంతో 27,188.38 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచి 196.95 పాయింట్లు పడిపోయి 2.34 శాతం నష్టంతో 8,236.45 పాయింట్ల వద్దా కొనసాగాయి. నిఫ్టీ-50లో మూడు కంపెనీలు మాత్రమే లాభాల్లో నిలిచాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 237 పాయింట్లు, స్మాల్ క్యాప్ 232 పాయింట్లు దిగజారాయి. జీఎంటర్ టెయిన్ మెంట్, లుపిన్, భారతీ ఎయిర్ టెల్ మాత్రమే 0.22 నుంచి 2.58 శాతం వరకూ లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్, ఎస్ బీఐ, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ తదితర సంస్థలు నాలుగు శాతానికి పైగా నష్టపోయాయి.