: 101 నదులను కలుపుతూ మార్గం, 1,100 ద్వీపాల అభివృద్ధి: మోదీ లక్ష్యాన్ని వివరించిన గడ్కరీ
దేశంలోని 101 నదులను అనుసంధానించడం ద్వారా నదీ జల రవాణా మార్గాలను అభివృద్ధి చేయడంతో పాటు 1,100 ద్వీపాలను నిర్మించి టూరిజానికి పెద్ద పీట వేయాలన్నది ప్రధాని మోదీ లక్ష్యమని రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా 300 లైట్ హౌస్ లను నిర్మించాలని కూడా మోదీ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టుల కోసం రూ. 50 వేల కోట్లను వెచ్చించనున్నామని, అంతకన్నా ముందు 101 నదుల మద్య జలమార్గాల ఏర్పాటుకు పార్లమెంటు అనుమతి పొందాల్సి వుందని అన్నారు. ఒకసారి అనుమతులు వస్తే రెండు మూడేళ్లలో పనులు పూర్తవుతాయని గడ్కరీ వివరించారు. జలమార్గాలు, ద్వీపాల అభివృద్ధిపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఇప్పటికే ప్రధాని మోదీ తమను కోరారని 'ఇన్ లాండ్ వాటర్ వేస్' అంశంపై ఫిక్కీ ఆధ్వర్యంలో ఏర్పాటైన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇండియా, బంగ్లాదేశ్ ల మధ్య జలమార్గాల ద్వారా రవాణా సదుపాయాలు కల్పించే నిమిత్తం ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్) విధానంలో జలమార్గాలను అభివృద్ధి చేస్తామని వివరించారు.