: ఆవిర్భావ వేడుకలకు వ్యతిరేకంగా విద్యార్థుల ర్యాలీ... ఓయూలో ఉద్రిక్తత
తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కళకళలాడాల్సిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్రిక్తతకు నెలవైంది. పేదల ఇళ్ల కోసం ఓయూ భూములను స్వాధీనం చేసుకుంటామన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటనతో విద్యార్థి లోకం ఒక్కసారిగా భగ్గుమన్న సంగతి తెలిసిందే. అంతేకాక ఉద్యగాల భర్తీలో జరుగుతున్న జాప్యంతోనూ సర్కారుపై విద్యార్థులు ఆగ్రహంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆవిర్భావ వేడుకలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన విద్యార్థులు, వేడుకలకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. తమను అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్న పోలీసులను విద్యార్థులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. దీంతో వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.