: బంగ్లా టూర్ కు టీమిండియా కోచ్ గా రవిశాస్త్రి... బ్యాటింగ్ కోచ్ గా సంజయ్ బంగర్
బంగ్లా టూర్ కు బయలుదేరనున్న టీమిండియా జట్టుకు బీసీసీఐ డైరెక్టర్ రవిశాస్త్రి కోచ్ గా వ్యవహరించనున్నాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కోచ్ డంకన్ ప్లెచర్ పదవీ కాలం ముగిసింది. అయితే ఆయన స్థానంలో కొత్త కోచ్ నియామకంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడలేదు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లతో బీసీసీఐ ఓ కమిటీని నియమించింది. జట్టు కోచ్ గా ఎవరుంటే బాగుంటుందన్న అంశంపై బీసీసీఐకి ఈ కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటిదాకా ఆ కమిటీ ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. దీంతో కోచ్ ఎంపిక పూర్తి కాలేదు. ఈ క్రమంలో బంగ్లా టూర్ కు బయలుదేరనున్న టీమిండియాకు రవిశాస్త్రి కోచ్ గా వ్యవహరిస్తారని బీసీసీఐ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. మరోవైపు జట్టు బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ గా సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్ గా ఆర్.శ్రీధర్ లను నియమిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.