: చర్లపల్లికి రేవంత్ రెడ్డి... చంచల్ గూడ జైలు అధికారుల వినతికి కోర్టు ఓకే!
నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిపోయిన టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించేందుకు ఏసీబీ న్యాయస్థానం అనుమతిచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసేందుకు రూ.5 కోట్లిస్తామని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఎరవేసిన రేవంత్ రెడ్డి, మొన్న రూ.50 లక్షలను స్వయంగా అందించారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న ఏసీబీ వలపన్ని రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న ఏసీబీ న్యాయస్థానం రేవంత్ కు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో పోలీసులు ఆయనను చంచల్ గూడ్ జైలుకు తరలించారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో తీవ్రవాదులున్నారని, సరిపడ బ్యారక్ లు కూడా అందుబాటులో లేవని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంచల్ గూడ జైలులో రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయి భద్రత కల్పించలేమని, ఆయనను చర్లపల్లి జైలుకు తరలించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు చంచల్ గూడ జైలు అధికారుల వినతికి సానుకూలంగా స్పందించింది. రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించాలని న్యాయస్థానం ఏసీబీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.