: మరిన్ని రోజులు జైల్లోనే రేవంత్... బెయిల్ విచారణ వాయిదా
ఎమ్మెల్యేను కొనుగోలు చేయబోయి అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి మరిన్ని రోజుల పాటు చంచల్ గూడ జైల్లో ఉండక తప్పేలా లేదు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు మరోమారు వాయిదా వేసింది. ఈ ఉదయం పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానానికి, రేవంత్ తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. సెకండరీ సాక్ష్యాల పేరిట ఏసీబీ చూపుతున్న వీడియోల్లో నిజానిజాలు తేలాల్సి వుందని, గౌరవ మర్యాదలతో బతుకుతున్న తన క్లయింటు బెయిలిస్తే ఎక్కడికీ పారిపోడని వివరించారు. ఆయనకు బెయిలుపై స్పందించాలని ఆదేశిస్తూ, ఏసీబీకి నోటీసులు జారీ చేసిన కోర్టు, ఈ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. మరోవైపు రేవంత్ ను కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ వేసిన పిటిషన్ పైనా విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.