: మాధురితో పాటు అమితాబ్, ప్రీతీలపైనా 'మ్యాగీ' కేసు
గతంలో మ్యాగీ నూడుల్స్ ప్రచార చిత్రాల్లో కనిపించినందుకు ఇప్పటికే మాధురీ దీక్షిత్ పై కేసు నమోదు కాగా, తాజాగా అమితాబ్ బచ్చన్, ప్రీతీ జింటాలపైనా కేసు దాఖలైంది. ముజఫర్ పూర్ జిల్లా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో వీరిపై కేసు నమోదైంది. కాగా, భారత ఆహార భద్రత-ప్రమాణాల సంస్థ ఆధ్వర్యంలో మ్యాగీ ఉత్పత్తులకు సంబంధించిన మరిన్ని నమూనాలను పరీక్షిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. మ్యాగీ నూడుల్స్ లో మోనోసోడియం గ్లుటమేట్, సీసం వంటివి పరిమితికి మించి ఉన్నాయని యూపీ ఆహార భద్రతా విభాగం గుర్తించిన నేపథ్యంలో వేర్వేరు రాష్ట్రాల్లో తయారైన నూడుల్స్ ను పరీక్షించాలని కేంద్రం నిర్ణయించింది. కాగా, మరో రెండు రోజుల్లో ఈ నివేదికలు వెలువడతాయని, సంస్థ ప్రకటనలు ప్రజలను తప్పుదారి పట్టించేవిగా ఉంటే, చర్యలు తప్పవని స్పష్టం చేసింది.