: స్టీఫెన్ తో చంద్రబాబు నేరుగా మాట్లాడారు... త్వరలోనే ఆధారాలు: టీ మంత్రి హరీశ్
ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డి పాత్రధారి మాత్రమేనని, అసలు సూత్రధారి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడేనని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో చంద్రబాబు నేరుగా మాట్లాడినట్లు ఆధారాలున్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ ఆధారాలు త్వరలోనే బయటకు రానున్నాయని కూడా హరీశ్ చెప్పారు. ఏపీలో అక్రమంగా సంపాదించిన డబ్బుతో చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు వ్యవహారంపై చంద్రబాబు ఇప్పటిదాకా నోరు విప్పలేదని, ఇదే ఆయన పాత్రకు నిదర్శనమని హరీశ్ అన్నారు. దివంగత ఎన్టీఆర్ తెలుగు జాతి కీర్తి ప్రతిష్ఠలను పెంచితే, చంద్రబాబు మాత్రం తెలుగు ప్రజలు తలదించుకునేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నీతిమంతమైన పాలన అందిస్తామని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీ, అవినీతి మకిలి అంటిన టీడీపీతో దోస్తీని కొనసాగించడంపై బీజేపీ నేతలు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.