: ఇకపై మరింత సులువుగా ఐటీ రిటర్న్స్ దాఖలు
ఆదాయపు పన్ను రిటర్న్ పత్రాలు దాఖలు చేసే వారికి ఉపశమనం కలిగించేలా నిబంధనలను సరళతరం చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దాఖలు చెయ్యాల్సిన పేజీలను తగ్గిస్తామని, ఇదే సమయంలో పన్ను ఎగవేతను నివారించేందుకు ప్రయత్నిస్తామని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ మారనున్న విధానంలో ఇ-ఫైలింగ్ పద్ధతిని వాడుకునే వారికి జూన్ మూడవ వారం వరకూ సమయమిస్తామని పేర్కొంది. ఇదే సమయంలో రిటర్న్స్ దాఖలుకు జూలై 31గా ఉన్న ఆఖరు తేదీని ఆగస్టు 31 వరకూ పొడిగించనున్నామన్న సంకేతాలనూ పంపింది. పన్ను సంస్కరణలో భాగంగా గడచిన ఏప్రిల్ లో ప్రకటించిన నిబంధనలపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ మార్పులు చేయనున్నట్టు సమాచారం. తొలుత విదేశీ ప్రయాణాల వివరాలు, నెలవారీ బ్యాంకు ఖాతాల సమాచారం, మూలధన లాభాల వివరాలు ఇత్యాది 14 పేజీలను నింపాల్సి వుండగా, వీటన్నింటినీ తొలగిస్తామని, కొత్త దరఖాస్తు ఫారం 3 పేజీలు మాత్రమే ఉంటుందని ఆర్థిక శాఖ తెలిపింది. మూలధన లాభాలు పొందని వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కోసం 'ఐటీఆర్ 2ఏ' పేరిట కొత్త దరఖాస్తును విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. బ్యాంకు ఖాతాల వివరాలు తెలియజేయాలన్న నిబంధనా తొలగిపోనుంది. పన్ను చెల్లింపుదారులు గత మూడేళ్లుగా నిర్వహించిన బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లడించకపోయినా పర్వాలేదని, కేవలం బ్యాంకులో ఉన్న నిల్వను చూపిస్తే చాలని, ఒక్క సంవత్సరం ముందు నుంచి నిర్వహిస్తున్న ఖాతాల వివరాలు అందించాలని సూచించింది.