: 126 వద్దు, 36 చాలు... యుద్ధ విమానాల కొనుగోలులో వెనక్కు తగ్గిన భారత్
ముందుగా ఒప్పందం చేసుకున్నట్టుగా 126 రఫాలే జెట్ విమానాలు కొనుగోలు చేయలేమని, తమకు 36 విమానాలు చాలని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రష్యాలో తయారైన మరో మూడు ఎస్ యూ-30 ఎంకెఐ విమానాలు కొంటామని, మిగిలిన విమాన అవసరాలను దేశీయంగా తయారవుతున్న తేజాస్ (మార్క్-2)తో భర్తీ చేయాలన్నది తమ అభిమతమని ఆయన తెలిపారు. సాధ్యమైనన్ని ఎక్కువ తేజాస్ విమానాలను తయారు చేయిస్తామని ఆయన అన్నారు. కాగా, ఇండియా తూర్పు, పశ్చిమ తీరాల గస్తీ నిమిత్తం 42 నుంచి 44 తేలికపాటి యుద్ధ విమానాలు అవసరం కాగా, అందుబాటులో 34 మాత్రమే ఉన్నాయి. మరో 14 ఎంఐ-జి-21, ఎంఐజి-27 విమానాలు 2022 నాటికి రిటైర్ కానున్నాయి. అంతకుముందు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ, రఫాలే ఫైటర్ విమానాల సంఖ్యను పెంచే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ఇటీవలి మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా రూ. 1.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 126 రఫాలే జెట్ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుని వచ్చిన సంగతి తెలిసిందే. "నాకు బీఎండబ్ల్యు, మెర్సిడిస్ బెంజ్ అంటే ఇష్టం. ఇదే సమయంలో నేను వాటిని కొనలేను. వాటి అవసరమూ నాకు లేదు. ఉన్న కార్లతో సర్దుకోవాల్సిందే. అదే విధంగా, అత్యంత ఖరీదైన రఫాలేలను దక్కించుకునేందుకు ప్రస్తుతం ఆర్థిక స్తోమత చాలదు" అని పారికర్ వ్యాఖ్యానించారు.