: ఇక ఏటీఎంల నుంచి పేపర్ రశీదులు రావు!
ఏటీఎంల నుంచి నగదును విత్ డ్రా చేసుకున్నాక, ఎంత తీశాము? ఇంకా ఖాతాలో ఎంత నగదు నిల్వ ఉంది? తదితర విషయాలతో కాగితం రశీదు వస్తుందన్న సంగతి తెలిసిందే. ఇకపై కాగితం రశీదు నిలిపివేయాలని హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు నిర్ణయించింది. దీని బదులుగా బ్యాంకులో నమోదు చేయించుకున్న సెల్ ఫోన్ నెంబరుకు వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తామని బ్యాంకు వెల్లడించింది. ఆరంభంలో కొద్ది ఏటీఎంలలో పేపర్ రశీదులను నిలిపివేస్తామని, ఆపై ఈ నెలాఖరులోగా అన్ని ఏటీఎంలకూ విస్తరిస్తామని తెలియజేసింది. దేశవ్యాప్తంగా తమకు 11,700 ఏటీఎం కేంద్రాలుండగా, వీటిల్లో కాగితం రశీదులు నిలిపివేయడం వల్ల సాలీనా రూ. 10 కోట్ల వరకూ ఆదా అవుతుందని తెలిపారు. కాగా, ఇప్పటికే పేపర్ రశీదు కావాలా? వద్దా? అన్న ఆప్షన్ ను ఏటీఎం కేంద్రాలు కోరుతున్నాయన్న సంగతి తెలిసిందే. సమీప భవిష్యత్తులో మిగతా బ్యాంకులన్నీ ఇదే పద్ధతిని అమలు చేసేందుకు నిర్ణయించాయి.