: కేసీఆర్ ను కుర్చీలో నుంచి దించుతా... అక్రమ కేసులు పెట్టిన పోలీసులను లోపల వేయిస్తా: రేవంత్
ఒక మిత్రుడితో అర్జెంట్ పని ఉందని ఇక్కడకి పిలిపించారని... అందుకే తాను ఇక్కడకు వచ్చానని, ఈ లోగా అప్పటికే ఇక్కడున్న పోలీసులు తనను రౌండప్ చేసి అదుపులోకి తీసుకున్నారని టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తనపై చేయి కూడా చేసుకున్నారని, చేతికి గాయం కూడా అయిందని మీడియాకు చూపించారు. రాబోయే కాలంలో కూడా కేసీఆర్ పై పోరాడతానని... కుర్చీలోంచి దించుతానని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరంగా తనను అదపులోకి తీసుకున్న పోలీసులను కూడా లాకప్ లో వేయిస్తానని చెప్పారు. గతంలో మీడియాను అణచివేసిన కేసీఆర్... ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ద్రోహులను గెలిపించుకోవడానికి కేసీఆర్ ఈ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాస్తవంగా సాయంత్రం 6 గంటలకు చంద్రబాబుతో తనకు మీటింగ్ ఉందని... ఈలోగా తన స్నేహితుడిని కలసి, సమస్య ఏమిటో కనుక్కుందామని ఇలా వచ్చానని... కానీ, అప్పటికే ప్లాన్ సిద్ధం చేసుకున్న వీరు నన్ను ఇరికించారని చెప్పారు. అరెస్ట్ సమయంలో తన వద్ద డబ్బు ఏమీ లేదని తెలిపారు. తనపై అభియోగాలు మోపింది అధికార పార్టీ ఎమ్మెల్యే అని... దీన్ని బట్టి కావాలనే తనను ఇరికించారనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చని అన్నారు. రానున్న రోజుల్లో... కేసీఆర్, టీఆర్ఎస్ వర్సెస్ రేవంత్, టీడీపీ పోరు ఉంటుందని చెప్పారు. తనపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా భయపడనని చెప్పారు. కేసీఆర్ తప్పుడు నిర్ణయాలను, తప్పులను బయట పెడతానని అన్నారు. కేవలం ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి కేసీఆర్ ఇంతగా దిగజారిపోయారని చెప్పారు.