: అధికారుల నిర్వాకం...కరెంటు బిల్లు 55 కోట్లు!


సాధారణంగా కరెంటు బిల్లు వందలు, వేలల్లో వస్తుంది. పెద్ద పెద్ద కంపెనీలైతేనో లేక, సచివాలయం లాంటి పెద్ద కార్యాలయాల్లో అయితే కరెంటు బిల్లు లక్షల్లో ఉంటుంది. కానీ అధికారులు ఓ ఇంటికి 55 కోట్ల కరెంటు బిల్లు పంపి తమ తెలివితేటలు ప్రదర్శించారు. ఆ ఇంటి ఓనర్ గుండె గట్టిది కనుక ఏమీ కాలేదు కానీ, అదే అధైర్యవంతుడైతే ఏం జరిగి ఉండేదో ఊహించుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే... రాంచీలో నివాసముండే కృష్ణ ప్రసాద్ కొన్ని రోజుల క్రితం ఓ వివాహ వేడుకకు వెళ్లాడు. పెళ్లి నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి కరెంట్ బిల్లు వచ్చి ఉంది. దానిని తీసుకున్న కృష్ణ ప్రసాద్ షాక్ తిన్నాడు. నెల బిల్లు అక్షరాలా 55, 49, 88, 036 రూపాయిలు వచ్చింది. ఇంత బిల్లును చూసిన తన తల్లి (55) మరణం అంచుల వరకూ వెళ్లిందని మండిపడ్డారు. ఈ బిల్లుపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇంతా చేసి ఆ ఇల్లు రెండు గదుల ఇల్లు. అందులో ఐదుగురు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన జార్ఖండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్, ఇది సాంకేతిక తప్పిదమని పేర్కొంటూ, ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది.

  • Loading...

More Telugu News